నెల్లూరుజిల్లా కొత్త కలెక్టర్‌గా హరినారాయణన్, కొత్త ఎస్పీగా తిరుమలేశ్వర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇద్దరూ యువకులే. విధినిర్వహణ పట్ల పూర్తి అవగాహన కలిగిన బాధ్యతగల అధికారులు. ఓ వైపు సాధారణ పరిపాలన, మరోవైపు శాంతి భద్రతలు… రెండూ అత్యంత కీలకమైన విభాగాలు. ఈ రెండు విభాగాలకు ఒకేసారి కొత్త సారధులు రావడం విశేషం.
కలెక్టర్ జిల్లాకి కొత్తవారు. ఎస్పీ నెల్లూరుకు పాత చుట్టమే. గతంలో రూరల్ డీఎస్పీగా ఆయన జిల్లాలో పనిచేశారు. తిరుమలేశ్వర్‌రెడ్డి అత్తగారి జిల్లా కూడా నెల్లూరే.
తనదైన ముద్ర వేసుకున్న చక్రధర్‌బాబు…
జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసిన చక్రధర్‌బాబు విధి నిర్వహణలో తనదైన ముద్ర వేసుకున్నారు. అత్యంత లౌక్యం తెలిసిన అధికారిగా అందరి మన్నలను అందుకున్నారు. నెల్లూరుజిల్లా నాయకులతో సమన్వయం చేసుకుని వారిని సంతృప్తిపరచే స్థాయిలో పనిచేయడం అంటే అంత సులభం కాదు. చక్రధర్‌బాబు విజయవంతంగా తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని హమ్మయ్య అనిపించుకున్నారు.
మెప్పించలేకపోయిన విజయారావు…
ఎస్పీ విజయారావు పనిచేసింది కొద్దికాలమే. శాంతి భద్రతల పరిరక్షణలోనూ, అస్తవ్యస్తంగా ఉన్న నగర ట్రాఫిక్ క్రమబద్దీకరణ వ్యవహారంలోనూ, రాజకీయ కొట్లాటల నియంత్రణ విషయంలోనూ ఆయన ముద్ర పెద్దగా కనిపించకపోవడం గమనార్హం. కుమ్ములాటలు, కొట్లాటలతో వర్ధిల్లుతుండిన అధికారపార్టీ నేతల మధ్యన ఆయన నలిగి పోయారు. రెండువర్గాలనీ మెప్పించేలా పనిచేయడం ఆయనకు సాధ్యం కాలేదనే చెప్పొచ్చు.
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ఏడాదిలో అడుగుపెట్టిన తరుణంలో జిల్లా ప్రధాన విభాగాల అధికారులిద్దరినీ కొత్త వారిని నియమించడం వారి పనితీరు పట్ల ముఖ్యమంత్రికి ఉన్న నమ్మకమే నిదర్శనమని చెప్పుకోవచ్చు. అందులోను రాబోవు ఎన్నికలలో నెల్లూరుజిల్లా చాలా కీలకం. కొత్త సారధులిద్దరికీ ‘లాయర్’ అభినందనలు.
జిల్లా అభివృద్ధే లక్ష్యం ` కొత్త కలెక్టర్ హరినారాయణన్
ప్రజలందరి సహకారంతో జిల్లా పురోభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజలకు సంక్షేమఫలాలను అందిస్తామని కొత్త కలెక్టర్ హరినారాయణన్ చెప్పారు. ఈనెల 12న ఆయన నెల్లూరు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధనకు, ప్రభుత్వ లక్ష్యాలను సాధించేందుకు కృషిచేస్తామన్నారు. తొలుత వేదపండితుల ఆశీస్సులందుకుని కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జేసీ కూర్మనాథ్, కందుకూరు సబ్‌కలెక్టర్ శోభిక, డిఆర్‌ఓ వెంకట నారాయణమ్మ, నుడా వైస్‌ఛైర్మెన్ బాపిరెడ్డి, ఆర్డీఓలు శీనానాయక్, కరుణకుమారి, జడ్పీ సిఇఓ చిరంజీవి తదితరులతో పాటు అన్నిశాఖల అధికారులు పాల్గొని కొత్త కలెక్టర్‌కు స్వాగతం పలికి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మంత్రి కాకాణిని, జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామినిలను గౌరవపూర్వకంగా కలుసుకున్నారు.
నేరాలను నియంత్రిస్తాం ` నూతన ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి
జిల్లాలో నేరాలను నియంత్రించి, శాంతిభద్రతలను పరిరక్షిస్తామని నూతన ఎస్పీ కె.తిరుమలేశ్వరరెడ్డి చెప్పారు. ఈనెల 12న ఆయన నెల్లూరుజిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. మాదకద్రవ్యాలు, డ్రగ్స్ వంటి వాటిని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీషీటర్లు, పాతనేరస్తులపై నిఘా ఉంటుందన్నారు. ఎల్లవేళలా తాము ప్రజలకు అందు బాటులో ఉంటామన్నారు. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం అవసరమన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. జిల్లాపై తనకు అవగాహన ఉందని, పటిష్టమైన చర్యలతో జిల్లాలో నేరాలను నిరోధించేందుకు ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ఎస్పీని ఏఎస్పీలు హిమతి, ప్రసాద్, శ్రీనివాసరావు, పలువురు డిఎస్సీలు కలసి పుష్పగుచ్ఛాలందజేసి స్వాగతించారు.

GIPHY App Key not set. Please check settings